Skip to content

ఆడపిల్ల పుడితే అ గ్రామంలో పండగే!

ఆడపిల్ల పుట్టిందా.. అయ్యో.. అనడం విన్నాం. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకోవడమూ చూశాం. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాపూర్ లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరుమ్మడిగా సంబంరాలు చేస్తారు.

ఆమెకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు. వారి ఆర్థిక అవసరాలకు కావాల్సిన బరోసాను కూడా ఇచ్చేస్తారు. వారు ఇదంతా ఎందుకు చేస్తు న్నారు. దీని వెనుక స్ఫూర్తిదాయకమైన కారణముంది. కొండాపూర్ మండలంలోని చిన్న పల్లెటూరు పరిదాపూర్. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలని స్థానికులు నడుంబిగించారు.

గతేడాది సెప్టెంబరు నుంచి ఊరంతా ఏకమై శ్రమదానాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక అధికారులు కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లారు.

అలా ఒకరి ఇంటికి వెళుతుండగా ఆశా కార్యకర్త ఒకరు వద్దని వారించారు. ఎందుకు అని మిగతావారు అడిగితే.. ఇంట్లో ఇల్లాలికి మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టింది. వాళ్లు బాధలో ఉన్నారని చెప్పింది. ఈ సమాధానంతో అందరూ ఆలోచనలో పడ్డారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకు మరి వాళు పుట్టారని ఇలా విచారణ.

ఈ పరిస్థితిలో మార్పు తేవాలని సర్పంచ్ తోపాటు పంచాయితీ కార్యదర్శి, గ్రామంలోని యువకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు.

పుట్టిన ప్రతి ఆడపిల్లకూ సుకన్య సమృద్ధి యోజన పథకంలో లబ్ది చేకూరేలా చూస్తున్నారు. ఇందుకోసం తొలి నాలుగు నెలలూ పంచాయతీ నుంచి నెలకు రూ. 250 చొప్పున చెల్లిస్తున్నారు. ఆ తర్వాత నెలల్లో పిల్లల తల్లి దండ్రులు డబ్బులు జమ చేసేలా చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. వారి పేర్లతో ఖాతాలు తెరిచి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లను నమోదు చేయించారు. ‘ఆడపిల్లలు బారం కాదు. అవకాశాలు కల్పిస్తే వారే మన భవిష్యత్తును మార్చగలరు అనే సందేశాన్ని ఈ ఊర్లోని ప్రతి ఇంటికి చేర్చుతున్నారు. ఇందులో గ్రామస్తులందరూ చొరవ తీసుకుంటున్నారు.


దీంతో ప్రజల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. హరిదాస్ పూర్ లో పదేళ్లలోపు బాలికలు 45 మంది వరకూ ఉన్నారు. వీరి సమాచారాన్ని కూడా తీసుకుని వీరందరికీ మంచి భవిష్యత్తు, ప్రభుత్వ లబ్ధి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పులోనైనా అబ్బాయి పుడతాడని ఆశపడ్డాం. కానీ మూడోసారీ ఆడపిల్లే పుట్టింది. ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాం. ఇంతలోమా ఊరి వాళ్లంతా కలిసి ఇంటికొచ్చారు. ఇలా ఆలోచించడం తప్పని చెప్పారు. మా పాప పుట్టిన మూడో రోజున పంచాయతీ కార్యాలయాన్ని దీపాలతో అలంకరించి ఉత్సాహంగా వేడుక చేశారు.

ఇప్పుడునాకు ముగ్గురూ ఆడపిల్లలే అనే బాధ లేదు. సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని నా బిడ్డలను గొప్ప చదువుల చదివిస్తానంటూ సంతోషంగా చెబుతోంది సత్యవతి అనే మహిళ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *