కరోనా వైరస్ సోకితే ముందుగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులే ! కొవిడ్ 19 నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే వైరస్ పూర్తిగా తగ్గిపోయినా.. దాని ప్రభావం వల్ల ఊపిరితిత్తులు యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే కరోనా బారిన పడి దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి యథాస్థితికి చేరుకునేందుకు ఫిజియోథెరపిస్టులు కొన్ని వ్యాయామాలను సూచిస్తున్నారు. ప్రతి రోజు ఈ ఎక్సర్‌సైజ్‌లను 6 నుంచి 7 సార్లు చేయాలని చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి
స్పైరో మీటర్
ఒక మెషిన్ లో మూడు బాల్స్ ఉండే ఈ స్పైరో మీటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఊపిరితిత్తులను బలంగా చేసేందుకు ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది. ఈ స్పైరో మీటర్‌కు ఉండే చిన్న పైపును నోట్లో పెట్టుకుని.. బలంగా శ్వాస తీసుకోవాలి. మెషిన్లో ఉన్న బాల్స్ పైకి వచ్చేలా గాలిని బలంగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ముక్కు నుంచి గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ సమయంలో మెషిన్లోని బాల్స్ జెర్క్ ఇచ్చినట్టుగా ఒక్కసారిగా కిందపడకూడదు. ఒకేరకంగా బాల్స్ పైకి లేచి.. మళ్లీ కిందకు రావాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.
ముక్కుతో శ్వాస తీసుకుని నోటితో వదలాలి
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది మరో చక్క వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బలంగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత పీల్చిన గాలిని నెమ్మదిగా నోటి ద్వారా వదలాలి. ఇలా ఒక రోజులో కనీసం 6 నుంచి 7 సార్లు చేయాలి.
ఓంకారం
యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛరిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే ఈ వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది పురాతనం నుంచి వస్తున్న ఓ చక్కటి పద్ధతి. పొట్ట నుంచి ఓం శబ్దం ఉచ్చరిస్తూ గట్టిగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అయితే ఓంకారం శబ్దం చేసేటప్పుడు దీర్ఘం తీసినట్టుగా అంటూ శ్వాస తీసుకుని వదిలితే మంచి ఫలితం ఉంటుంది.
మరో వ్యాయమం
శ్వాసకు తగ్గట్టుగా ఊపిరితిత్తులను ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. రెండు చేతులను ముందుకు పెట్టాలి. బలంగా శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి తీసుకెళ్లాలి. శ్వాసకు తగ్గట్టుగా చేతులు వెనక్కి వెళ్లాలి. అలాగే శ్వాస వదులుతూ మళ్లీ చేతులను ముందు వైపుకు తీసుకురావాలి. ముందుగా రెండు చేతులను తల వెనుక భాగంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు మోచేతులను తల ముందు భాగం వైపు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు బలంగా శ్వాస తీసుకుంటూ.. రెండు మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. శ్వాస తీసుకునే క్రమానికి తగ్గట్టుగా మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా శ్వాసను వదులుతూ రెండు మోచేతులను దగ్గరగా తీసుకురావాలి.
బెలూన్ ఊదడం
ఊపిరితిత్తులు తొందరగా కోలుకోవడానికి ఎక్కువగా సూచించే పద్ధతి ఇది. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బెలూన్లలో గాలి నింపడానికి బలంగా ఊదాల్సి ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.
వాకింగ్
ఊపిరితిత్తుల స్థితిని బట్టి వాకింగ్ చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్కులు,
బయటకు వెళ్లే బదులు ఇంటి వరణలోనే వాకింగ్ చేయడం ఉత్తమం.