Skip to content

Sri Vidya Saraswathi & Shaneeshwara Temples Wargal – Medak District Complete Details in Telugu | వర్గల్ (గజ్వేల్) సరస్వతి పుణ్యక్షేత్రం

సకల దేవతలు సంచరించిన పుణ్యస్థలం.. మహాత్ములు నడయాడిన ప్రదేశం, మునులు, తపోధనులు తపమాచరించిన మహిమాన్విత ప్రాంతం.. సప్త స్వరాల గుండు పక్కన.. స్వయంభువుగా మహదేవుడు వెలసిన శంభుని కొండ శ్రీవిద్యా సరస్వతి ఆలయానికి నెలవైంది. ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి సంకల్పం, సత్యపథం సేవాసమితి సహకారంతో 1989లో వసంత పంచమి రోజున ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 1992లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ్మ భారతీ స్వామి వారు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి తేజోమయమైన అమ్మవారు తన చెంత చేరిన భక్తులను కటాక్షిస్తూ. చిన్నారులకు అక్షర జ్ఞానకాంతులు పంచుతూ, భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. విశేష భక్త జనాధరణతో రెండో బాసరగా వినుతికెక్కింది.


అరుదైన శనీశ్వరాలయం..


వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం అనేక ఆలయాల సంగమం. నవగ్రహాల్లో అతి కీలకంగా పరిగణించే శనీశ్వరుని ఆలయాలు దేశంలోనే అరుదు. తెలంగాణ ప్రాంత భక్తులకు చేరువగా వర్గల్ అమ్మవారి ఆలయం దిగువన శనీశ్వరాలయం నిర్మితమైంది.


శ్రీలక్ష్మీ గణపతి ఆలయం..


అమ్మవారి సన్నిధానం ఎడమ వైపు కొండపైన శ్రీలక్ష్మీ గణపతి ఆలయం నిర్మితమైంది. 2001లో కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయంలో శ్రీలక్ష్మీగణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇక్కడి శంభులింగేశ్వరుడి విగ్రహం స్వయంభూగా ప్రసిద్ధి. ఈ పురాతన ఆలయంలో 700 ఏళ్ల క్రితం నుంచే పూజలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.


ఉత్సవాల తోరణం..


వర్గల్ క్షేత్రం నిత్య ఉత్సవాల తోరణం. ప్రతి నిత్యం అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతినెల అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున విశేష అర్చనలు, చండీ హెూమం నేత్రపర్వంగా జరుగుతాయి. ప్రతి మాఘ శుద్ధ త్రయోదశి రోజున దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, చండీ హెూమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వియుజ మాసంలో అమ్మవారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.


వసంతపంచమి మహోత్సవం..


శ్రీవిద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో మాఘ మాసంలో వసంత పంచమి మహోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీపంచమి) సందర్భంగా విశేష పంచామృతాభిషేకం, చండీ హెూమం, లక్ష పుష్పార్చన, 56 రకముల భోగాలతో నివేదన, విద్యా జ్యోతి దర్శనం తదితర కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి. అమ్మవారు వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటంతో భక్తులను కటాక్షిస్తారు. ఈ విశేషోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి.


వేద పాఠశాల..


వేదవిద్య పరిరక్షణ, సంపదలైన వేదాలను సనాతన వారసత్వ భావి తరాలకు అందించాలనే స్రంకల్పంతో అమ్మవారి సన్నిధిలో 1999 లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ భారతి స్వామివారు శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయాన్ని ప్రారంభించారు. ఉపనయం జరిగిన 8 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల బ్రాహ్మణ పిల్లలకు ఇక్కడ పంచదశకర్మలు నేర్పుతారు.


నిత్యాన్నదానం..


ప్రతి భక్తునికి అమ్మవారి మహా ప్రసాదం అందించాలనే సంకల్పంతో 2001లో అన్నదాన సత్రాన్ని ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం 8,00,000 మంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతున్నది.


టవర్ లిఫ్ట్..


ఎత్తైన కొండ మీద కొలువుదీరిన శ్రీసరస్వతీ మాతను దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో చేరుకోలేని వికలాంగులు, వయో వృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయుక్తంగా టవర్ లిఫ్ట్ ఏర్పాటు చేసారు. లిఫ్ట్ నుంచి ఆలయ గర్భగుడి వరకు చేరేందుకు వీల్ ఛైర్లు సమకూర్చారు.


భక్తులు బస చేసేందుకు సత్రాలు.


క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులు బసచేసేందుకు సత్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా కల్యాణ మండపం, శారదీయమ్, తదితర అనేక విశాలమైన భవనాలు వందలాది యాత్రికులు బస చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. తాగునీటి వసతితోపాటు,మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కు సదుపాయం ఉన్నది.


ఆకట్టుకునే వీణాపాణి విగ్రహం..


కొండ మీద భక్తులు వెళ్లే మెట్ల మార్గం పక్కన ఎత్తైన వీణాపాణి విగ్రహం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం ముందర వాటర్ ఫౌంటేన్, స్వాగత మహా కలశం ఆకట్టుకుంటాయి.


ఆహ్లాదం పంచే చిల్డ్రన్ పార్క్..


శ్రీసరస్వతి క్షేత్రానికి వచ్చిన భక్తులు, చిన్నారులు సేద తీరేందుకు పర్యాటక శాఖ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసింది. కార్పెట్ గ్రాస్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, చిన్నారుల ఉయ్యాలలు, ఇతర ఆటల సామాగ్రితో ఆహ్లాదకరంగా ఈ పార్కును తీర్చిదిద్దారు.


అక్షర స్వీకరాల కోసం మహామండపం..


చదువుల తల్లి సన్నిధిలో వేలాదిగా చిన్నారుల అక్షర స్వీకారాలు జరుగుతాయి. ప్రత్యేకంగా విశేష పర్వదినాల్లో, సెలవు రోజులలో రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రద్దీని తట్టుకునేందుకు భక్తులకు సౌకర్యవంతంగా భక్తజన సహకారంతో మూడంతస్తుల మహామండపం నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 4 కోట్ల పైచిలుకు వ్యయంతో కొనసాగుతున్న ఈ నిర్మాణం ఇప్పటికే 80 శాతం మేర పూర్తయింది. వసంత పంచమి సందర్భంగా అందులోనే అక్షరాభ్యాసం, లక్షపుష్పార్చనాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఇలా చేరుకోవాలి..


వర్గల్ క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యాలు ఉన్నాయి. సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఉదయం 8.15 గంటలకు, 10 గంటలకు, మద్యాహ్నం 12.15 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు బస్సులు వర్గల్ క్షేత్రానికి వచ్చి వెళతాయి. ఇవే కాకుండా సికిందరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులలో వర్గల్ క్రాస్ రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలలో క్షేత్రానికి చేరుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *